: ఏపీ స్పీకర్ కోడెల ఇలాకా సత్తెనపల్లిలో మరుగుదొడ్ల విప్లవం!
ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ను ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నడుం బిగించారు. ఇందుకు తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లినే ఆయన కార్యరంగంగా మలుచుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. మహిళల ఆత్మగౌవర పరిరక్షణ పేరిట కోడెల చేపట్టిన ప్రచారానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 15 వేల మరుగుదొడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించిన కోడెల, మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తల ద్వారా మరింత మేర నిధులు అందించనున్నారు. తద్వారా ప్రజలపై భారం పడకుండా చూడాలని కోడెల భావిస్తున్నారు. కోడెల వినూత్న చర్యలపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.