: ప్రధాని మోదీ చర్యతో చీలిక దిశగా శివసేన!
నిత్యం మొండి పట్టుదలతో తమను ఇరుకున పెడుతున్న శివసేనకు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి షాకే ఇచ్చారు. మోదీ చర్యతో శివసేనలో చీలిక తప్పదన్న వాదన కూడా వినవస్తోంది. ఆదివారం నాటి కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఉద్ధవ్ ఠాక్రేకు మోదీ ఊహించని షాకిచ్చారు. శివసేన సూచించిన అభ్యర్థుల ప్రాధాన్యం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన మోదీ, ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్ ప్రభుకు ఏకంగా కేబినెట్ హోదాను కట్టబెట్టారు. తమ పార్టీ ఎంపీ అనిల్ దేశాయ్ కు కేబినెట్ హోదా ఇవ్వాలన్న ఠాక్రే సూచనను మోదీ తోసిపుచ్చారు. దీంతో అనిల్ ను ఉద్ధవ్ వెనక్కు పిలిచారు. సురేశ్ ప్రభును కూడా వెనక్కు రావాలని శివసేన అధినేత ఆదేశించినట్లు సమాచారం. అయితే ఠాక్రే ఆదేశాలను పట్టించుకోని సురేశ్, మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో సురేశ్ ప్రభు పార్టీ ఆదేశాలను ధిక్కరించినట్టుగానే ఠాక్రే భావిస్తున్నారు. సాయంత్రం నిర్వహించనున్న భేటీలో ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.