: భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఈ అక్కాచెల్లెళ్లు ఎలా ప్రతిజ్ఞ చేశారో చూడండి!
హర్యానా రాష్ట్రం స్త్రీ శిశు హత్యలతో ఎంతో అపఖ్యాతిపాలైంది. ఇప్పటికీ అక్కడ అదే తంతు! రాష్ట్రంలో నేటికీ అబార్షన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని నివేదికలు ఘోషిస్తున్నాయి. వీటిపై చంచల్, దామిని అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు సమరశంఖం పూరించారు. వాటిపై పోరాడతామని ప్రతినబూనారు. ఆ ప్రతిజ్ఞ చేసేందుకు వారు తమ వివాహాన్ని వేదికగా చేసుకున్నారు. వారిద్దరి పెళ్లిళ్లు నవంబర్ 4న జింద్ లో జరిగాయి. హిందూ ఆచారం ప్రకారం వివాహ క్రతువు సందర్భంగా వధూవరులు అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం అదనంగా మరో 2 ప్రదక్షిణలు చేశారు. ఆ రెండు ప్రదక్షిణలను భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా చేశారట. వీరి వినూత్న ప్రతిజ్ఞను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెరో లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు.