: తొలిసారి మోదీ సర్కారుపై 'దీదీ' ప్రశంసలు
ఎన్డీయే సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందుంటారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అయితే, ఆమె తొలిసారిగా మోదీ సర్కారును మెచ్చుకున్నారు. బెంగాల్లోని ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరును కేంద్రం గుర్తించి, ప్రోత్సాహక నిధుల కింద రూ.22.33 కోట్లను కేటాయించడమే అందుకు కారణం. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు. "పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రుల అద్భుతమైన పనితీరును కేంద్రం గుర్తించింది. దేశంలోని ఈఎస్ఐ ఆసుపత్రులు కేంద్రం నుంచి ఈ స్థాయిలో నిధులను విడుదల చేయటం ఇదే ప్రథమం" అని మమత పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులను కేటాయించారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.