: కోస్తాంధ్రకు తప్పిన ముప్పు
వరుస తుపానులతో కోస్తాంధ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటికిమొన్న హుదూద్ తుపాను సృష్టించిన విలయం కోస్తాంధ్రవాసులను వణికించింది. బీబీసీలాంటి ఛానెళ్లు కూడా హుదూద్ తుపానుపై వార్తలను ప్రసారం చేశాయంటే... దాని తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అండమాన్ తీరంలో ప్రారంభమై కోస్తాంధ్రవైపు వస్తున్న మరో అల్పపీడనం ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు దడ పుట్టించింది. ఈ తుపాను కూడా భారీ స్థాయిలోనే విరుచుకు పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, అది నెమ్మదిగా బలహీనపడుతోందని, దాని ప్రభావం ఏ మాత్రం ఉండదని తాజాగా అధికారులు వెల్లడించారు. గత 12 గంటలుగా వాయుగుండం ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉందని, ఏపీ వైపు పయనిస్తూ క్రమంగా బలహీన పడుతుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయ దిశలో 560 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. అయితే, దీని ప్రభావం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు మాత్రం కురుస్తాయి. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయి.