: సుజనా చౌదరికే కేంద్ర మంత్రి పదవి?
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం టీడీపీకి దక్కనున్న బెర్తులో ఎవరు కూర్చుంటారన్న అంశంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న అశోక్ గజపతిరాజు మోదీ కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తాజా పునర్వ్యవస్థీకరణలో టీడీపీకి కేబినెట్ హోదా కాకుండా సహాయ మంత్రి పదవితోనే సరిపెట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నా, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకే మంత్రి పదవి దక్కుతుందని టీడీపీ ఎంపీలు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై గురువారం నేరుగా మోదీనే చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, సుజనా చౌదరి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే మొన్నటి ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన తనను కాదని మంత్రి పదవి ఎక్కడికి పోతుందని సీఎం రమేశ్ ధీమాగా ఉన్నారు. వీరిద్దరిలో సుజనా చౌదరి వైపే చంద్రబాబు మొగ్గడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.