: చంద్రబాబు కోసం మోదీ రెండుసార్లు ఫోన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రెండుసార్లు ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి టీడీపీలో ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకే మోదీ, చంద్రబాబుకు ఫోన్ చేశారట. అయితే ఢిల్లీ ప్రయాణంలో ఉన్న చంద్రబాబు తొలి ఫోన్ కు అందుబాటులోకి రాలేకపోయారు. దీంతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుకు పీఎంఓ అధికారులు ఫోన్ చేశారట. చంద్రబాబు అందుబాటులోకి రాగానే మోదీతో మాట్లాడించాలని ఆయనను కోరారట. అయితే ఢిల్లీలో విమానం దిగిన వెంటనే ఏపీ భవన్ కు రాకుండానే చంద్రబాబు ఎకనమిక్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. దీంతో రెండోసారి కూడా మోదీనే చంద్రబాబుకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ఎకనమిక్ సమ్మిట్ లో ప్రసంగిస్తున్నారు. అయితే రామ్మోహన్ రావు నేరుగా ఆయనవద్దకెళ్లి మోదీ ఫోన్ విషయం చెప్పారట. మోదీ ఫోన్ తో తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేసి, బయటకెళ్లిన చంద్రబాబు మోదీతో మాట్లాడారు. అనంతరం తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.