: ఏపీని దేశానికి ముఖద్వారంలా మలచాలన్నదే మా లక్ష్యం: చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రముఖులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏపీని దేశానికి ముఖద్వారంలా మలచాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. గనులు, పొడవైన తీరప్రాంతం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశామని చెెప్పారు. సమీకృత అభివృద్ధిలో సంస్కరణలు, సంక్షేమం ముఖ్యమన్న చంద్రబాబు, గత ఐదు నెలలుగా ఏపీలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఏపీలో ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ప్రతి పథకాన్ని ప్రత్యేక పద్ధతిలో ముందుకు తీసుకెళుతున్నామని, ఆ మేరకు ప్రచారం కల్పిస్తున్నామని వివరించారు. అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు బాబు. ప్రధాని బాగా పనిచేస్తున్నారని, రాష్ట్రాలు ఆయనను అనుసరించాలని సూచించారు. దేశంలో పారిశ్రామిక రంగానికి ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.