: ఈటెల వద్దకు ఎవరైనా వెళితే వీపు చింతపండు చేస్తారట!
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత కాలం సభలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వద్దకు ఎవరైనా దూసుకువస్తే వారికి వీపు చింతకాయ పచ్చడి చేద్దామని మంత్రి పద్మారావు అన్నారని మరో మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కొందరు సభ్యులు ఈటెలను అడ్డుకునేందుకు యత్నించారని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలది కాకిగోల అని, దాన్ని తాము పట్టించుకోబోమని అన్నారు. ఇక, టీడీపీ నేతలపై కేసీఆర్ తనయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిస్కెట్ల కోసం వెంపర్లాడే కుక్కల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంగిలి మెతుకులకు ఆశపడే వ్యక్తి అని, రేవంత్ రెడ్డి సిగ్గులేని వాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతుల కష్టాలు నిజమేనని, విద్యుత్ కొరత నెలకొని ఉందన్నారు. అయితే, అందుకు కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలేనని ఆరోపించారు. మున్ముందు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నింటిని తప్పక అమలు చేస్తామని అన్నారు.