: కేంద్ర కేబినెట్ విస్తరణలో మరో బెర్త్ కోసం టీడీపీ యత్నాలు
ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి మండలిని విస్తరించనున్నారన్న వార్తలు టీడీపీలో ఆశావహులను తెరపైకి తెస్తున్నాయి. ప్రస్తుత మోదీ కేబినెట్ లో పార్టీ ఎంపీ అశోక గజపతిరాజుకు మాత్రమే బెర్త్ దక్కింది. తాజా విస్తరణలో మరో మంత్రి పదవి కోసం టీడీపీ అప్పుడే యత్నాలు ముమ్మరం చేసింది. నేటి ఉదయం ఢిల్లీ వెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అంతేకాక కేబినెట్ లో కీలక వ్యక్తి అరుణ్ జైట్లీని కూడా కలవనున్నారు. బెర్త్ కోసం చంద్రబాబు శతథా యత్నిస్తుంటే, సదరు బెర్త్ ఎవరికి దక్కుతుందన్న అంశంపై తెలుగు తమ్ముళ్లు సమాలోచనల్లో మునిగిపోయారు. చంద్రబాబు యత్నాలు ఫలిస్తే, పార్టీ ఎంపీలు సీహెచ్ మల్లారెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేశ్ లలో ఎవరికో ఒకరికి ఆ బెర్తు దక్కుతుందన్న వాదన వినిపిస్తోంది.