: చంద్రబాబు... కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మ: సీపీఎం నేత బీవీ రాఘవులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవులు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పాలనలో ప్రపంచ బ్యాంకు చేతిలో కీలుబొమ్మగా పనిచేసిన చంద్రబాబు, తాజాగా, కార్పోరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రపంచంలో ఏ రాజధాని కూడా 30 వేల ఎకరాల్లో ఏర్పాటు కాలేదన్న రాఘవులు, రాజధాని కోసం 17 గ్రామాల రైతుల పొట్టకొట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తుల జేబులు నింపేందుకే చంద్రబాబు 30 వేల ఎకరాల పాట పాడుతున్నారని ఆయన ఆరోపించారు.