: అప్పారావు అరెస్టుతో భగ్గుమన్న ఆంధ్రా వర్సిటీ


మావోలతో సంబంధాలున్నాయని చెబుతూ ప్రొఫెసర్ అప్పారావును అరెస్ట్ చేసిన పోలీసుల తీరుపై ఆంధ్రా యూనివర్సిటీ భగ్గుమంది. కారణాలు చెప్పకుండా, వారెంట్ లేకుండా గురుతర బాధ్యతల్లో ఉన్న ప్రొఫెసర్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ విద్యార్థిలోకం మండిపడుతోంది. అప్పారావును అరెస్ట్ చేశామని విశాఖ రూరల్ ఎస్పీ ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురైన వర్సిటీ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. అప్పారావును తక్షణమే విడుదల చేయించాలంటూ వీసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు కూడా అప్పారావుకు బాసటగా నిలిచాయి. గిరిజన విద్యార్థులతో సంబంధాలున్న అప్పారావుకు, మావోలతో సంబంధాలు నెరపాల్సిన అవసరం లేదని నినదించాయి. తక్షణమే అప్పారావును విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగులు, విద్యార్థులు, పౌర హక్కుల సంఘం నేతల ఆందోళనలు క్షణక్షణానికి తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News