: శాకాహారంలో ఎముకలు... రైల్వే శాఖ తీరిది!
దూరప్రాంతాల్లో వెళ్లే రైళ్లలో క్యాటరింగ్ ఎంత నాసిరకంగా ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. ఆహారంలో కీటకాల అవశేషాలు, నాణ్యతలేని వంటకాలతో భారత రైల్వే శాఖ అభాసుపాలవుతోంది. తాజాగా, రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడు శాకాహారం తెప్పించుకుంటే, అందులో ఎముకలు కనిపించాయి. గౌహతి వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ లో సెప్టెంబర్ 19న తికమ్ చంద్ జైన్ (65) అనే వ్యక్తి ఢిల్లీలో ఎక్కాడు. ఆ మరుసటి రోజు శాకాహారం ఆర్డర్ చేశాడు. వెయిటర్ తెచ్చివ్వడంతో దాన్ని ఓపెన్ చేసి తినడం ప్రారంభించాడు. తాను నములుతున్నది ఎముకలని గుర్తించిన జైన్ వెంటనే మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. అనంతరం రైల్వే శాఖ ప్రధాన కార్యాలయానికి లేఖ రాశాడు. దీంతో, రైల్వే శాఖ శాకాహారంలో ఎముకల విషయమై విచారణ చేపట్టింది. జైన్ తన సహప్రయాణికుడు ఎంపిక చేసుకున్న నాన్ వెజ్ భోజనాన్ని తీసుకున్నాడని తెలిపింది. అటు, వెయిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ, నార్తర్న్ రైల్వే, క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ కు లక్ష రూపాయల జరిమానా విధించింది.