: కాంగ్రెస్ లో చేరిన సినీ నటుడు కార్తీక్
సీతాకోక చిలుక, అభినందన సినిమాల ద్వారా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న తమిళ సీనియర్ నటుడు కార్తీక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను స్థాపించిన అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 54 ఏళ్ల కార్తీక్ 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన ఆయన, ఆ పార్టీలో తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 2009 లోక్ సభ ఎన్నికలకు ముందు సొంత పార్టీని పెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించిన ఆయన విఫలమయ్యారు. కాగా, ఆయన పెట్టిన పార్టీ తమిళనాట పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.