: మరో గెలుపు కోసం భారత్... ప్రతీకారం కోసం లంకేయులు... రేపు రెండో వన్డే
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అహ్మదాబాదులోని సర్దార్ పటేల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. కటక్ వన్డేలో భారీ విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ లోనూ నెగ్గి ఆధిక్యం పెంచుకోవాలని భావిస్తోంది. అటు, శ్రీలంక తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ధావన్, రహానే, కోహ్లీ, రైనాలతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ భీకరమైన ఫామ్ లో ఉండగా, బౌలర్లు సైతం విశేషంగా రాణిస్తున్నారు. తొలి వన్డేలో 152.1 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన వరుణ్ ఆరోన్ గాయపడడం ఒక్కటే నిరాశపరిచే అంశం. ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ జట్టులోకొచ్చాడు. అయితే, తుది జట్టులో బిన్నీకి స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు. వరల్డ్ కప్ సన్నాహాలను మధ్యలోనే ఆపేసి, హడావుడిగా భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకకు ఇక్కడి పరిస్థితులు కొత్తేమీ కాదు. తొలి మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న లంక బౌలర్లు రెండో వన్డేలో కుదురుకుంటారని కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఆశిస్తున్నాడు. సీనియర్ బౌలర్లు లసిత్ మలింగ, రంగన హెరాత్ గైర్హాజరీలో లంక బౌలింగ్ దాడుల భారం దమ్మిక ప్రసాద్, గామగే, తిసర పెరీరా, సూరజ్ రణ్ దివ్ లపై పడింది. కటక్ మ్యాచ్ లో రణ్ దివ్ (3 వికెట్లు) మినహా మరెవ్వరూ కోహ్లీ సేనపై ప్రభావం చూపలేకపోయారు.