: నోరా లేక మోరీనా...? నోరు అదుపులో పెట్టుకో!: ఎర్రబెల్లి, కేసీఆర్ మధ్య వాగ్యుద్ధం
తెలంగాణ బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీటీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిందని సమాచారం. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఏసీ భేటీ జరిగింది. తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నాయి. టీడీపీ నుంచి ఎర్రబెల్లితో పాటు రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. దీనిపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఎర్రబెల్లి కల్పించుకుని గతంలో బీఏసీలో ఇద్దరు టీడీపీ నేతలకు అవకాశమిస్తామని కేసీఆర్ చెప్పిన మాటను గుర్తు చేశారు. సీఎం మాటపై నిలబడాలని, ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. దీనికి నిరాకరించిన కేసీఆర్, సభను సజావుగా ఎలా నడపాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సభలో ఎలా నడుచుకోవాలో మాకూ తెలుసంటూ రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో, 'బడ్జెట్ వినే ఓపిక లేని వారికి సభ ఎన్నిరోజులు నడిస్తే ఎందుకు?' అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. దీంతో, ఎర్రబెల్లి కల్పించుకుని "నీది నోరా, లేక, మోరీనా?" అంటూ వ్యాఖ్యానించారు. "మాటిస్తావు, దానిని ఉల్లంఘిస్తావు" అంటూ సీఎంపై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా "ఎర్రబెల్లీ... నోరు అదుపులో పెట్టుకో" అంటూ కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. నేతల మధ్య మాటల జోరు పెరుగుతుండడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్టు తెలుస్తోంది.