: సినీ నటుడు విజయ్ కాంత్ కు నాన్ బెయిలబుల్ వారంట్
తమిళ సినీ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ పై నేడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. జయలలిత సర్కారుపై విజయ్ కాంత్ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరునల్వేలి కోర్టులో ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో నేడు వారంట్ జారీ అయింది. జయలలితపై విజయ్ కాంత్ గతేడాది చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు 23 కేసులు నమోదయ్యాయి.
విజయ్ కాంత్ ఈ కేసుల విచారణలో భాగంగా నేడు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాల పేరిట ఆయన కోర్టుకు గైర్హాజరయ్యారు. విజయ్ కాంత్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉందని, కోర్టుకు రాలేడని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కాగా, విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే 2011 ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకుంది. అనంతరం జయలలితపై ఆయన పలు ఆరోపణలు చేయడంతో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి విజయ్ కాంత్ కు కోర్టులు చుట్టూ తిరగక తప్పడంలేదు.