: చంద్రబాబు చతురతపై పారిశ్రామికవేత్తల అమితాసక్తి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి చతురతపై పారిశ్రామిక వర్గాలు అమితాసక్తి చూపుతున్నాయి. బెంగళూరులో చంద్రబాబు జరిపిన ఒకే ఒక్క రోజు పర్యటన పారిశ్రామిక వేత్తల చర్చల్లో ఏపీని హాట్ టాపిక్ గా మార్చేసిందని ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. మంగళవారం బెంగళూరుకు వెళ్లిన చంద్రబాబునాయుడు అక్కడి ప్రభుత్వ పెద్దలతో కలవనప్పటికీ రోజంతా పారిశ్రామికవేత్తలతో గడిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, పారిశ్రామిక వర్గాల్లో అమితాసక్తిని రేకెత్తించాయి. మెరుగైన ప్రణాళికలు, పెట్టబడులతో వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తామని ప్రకటించిన చంద్రబాబు, అనుమతుల విషయంలో క్షణాల్లో నిర్ణయాలుంటాయని చెప్పారు. అందులో భాగంగానే హీరో మోటోకార్ప్ కు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేశానని బాబు చేసిన ప్రకటన బెంగళూరు వర్గాలను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే, ఒక్కరోజు పర్యటనతోనే చంద్రబాబు, బెంగళూరులోని ఐటీ కంపెనీలన్నింటినీ వెంటబెట్టుకుని వెళ్లిపోయే రీతిలో ఫలితాలు సాధించారని అక్కడి పారిశ్రామిక వేత్తలు గుసగుసలాడుకుంటున్నారు. పారిశ్రామిక దిగ్గజాలు కూడా బాబు వాగ్ధాటికి ముగ్ధులయ్యారట. ఇందులో భాగంగానే ఖోస్లా ల్యాబ్స్, ఏపీలో అడుగిడేందుకు పచ్చజెండా ఊపిందని చంద్రబాబుతో భేటీ అయిన పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు.