: 'వరల్డ్ కప్' లేకపోతే సచిన్ కెరీర్ కు పరిపూర్ణత వచ్చేది కాదు: అక్రమ్
వన్డే వరల్డ్ కప్ మరో వంద రోజుల దూరంలో ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ ఐసీసీ కోసం ఓ కాలమ్ రాశాడు. ప్రపంచ క్రికెట్లోని పలు అంశాలను తన వ్యాసంలో స్పృశించాడు. భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ పైనా తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. 2011 వరల్డ్ కప్ నెగ్గడంతో సచిన్ కెరీర్ పరిపూర్ణమైందని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ లేకుంటే సచిన్ కెరీర్ అసంపూర్ణంగానే మిగిలిపోయి ఉండేదని అన్నాడు. ఏ క్రికెటర్ కైనా వరల్డ్ కప్ విజయంతోనే కెరీర్ సాఫల్యత దక్కుతుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపాడు. కెరీర్ ఖాతాలో వరల్డ్ కప్ విజయం లేకపోతే ఎలా ఉంటుందో లారా, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ వంటి మేటి క్రికెటర్లను అడిగితే చెబుతారని ఈ స్వింగ్ సుల్తాన్ పేర్కొన్నాడు. కాగా, అక్రమ్ 1992లో వరల్డ్ కప్ నెగ్గిన పాక్ జట్టులో సభ్యుడు. 1999లో అతని నాయకత్వంలో పాక్ జట్టు రన్నరప్ గా నిలిచింది. అంతేగాదు, 1987, 1996లో వరల్డ్ కప్ సెమీస్ చేరిన పాక్ జట్టులోనూ అక్రమ్ ఉన్నాడు.