: ఒడిశాలో చిట్ ఫండ్ స్కాం: ఎంపీ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల అరెస్ట్


శారదా చిట్ ఫండ్... పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇబ్బందుల పాల్జేసింది. ఇదే తరహాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను సమస్యల సుడిలోకి నెడుతూ ఆ రాష్ట్రంలో మరో చిట్ ఫండ్ సంస్థ మోసం మంగళవారం వెలుగు చూసింది. నవ దిగంత కేపిటల్ సర్వీస్ పేరిట ఒడిశాలో వెలసిన చిట్ ఫండ్ సంస్థ రూ.4,375 కోట్ల మేర ప్రజల సొమ్మును సేకరించింది. దాదాపు 6.5 లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థ, మెచ్యూరిటీ తీరిన బాండ్లకు డబ్బులు చెల్లించడంలో విఫలమైంది. దీంతో డిపాజిటర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ పలు ఆసక్తికర అంశాలను వెలికి తీసింది. ఈ చిట్ ఫండ్ వ్యవస్థాపకులు అధికార బిజూ జనతా దళ్ కు చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధులని దర్యాప్తులో తేలింది. పార్టీ ఎంపీ రామచంద్ర హన్స్ దా, మాజీ ఎమ్మెల్యేలు సుబర్ణ నాయక్, హితేశ్ కుమార్ బగార్తిలు ఈ చిట్ ఫండ్ వ్యవస్థాపకులని తేల్చిన సీబీఐ మంగళవారం వారిని అరెస్ట్ చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలను నవీన్ పట్నాయక్ పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితులపై చట్టం ప్రకారం చర్యలు కూడా తీసుకోవాలని ఆయన సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు ఐదు రోజుల ముందు మరో చిట్ ఫండ్ స్కాంలో ప్రమేయముందన్న ఆరోపణలతో పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. వరుస ఘటనలతో పార్టీతో పాటు సీఎం నవీన్ పట్నాయక్ కూడా చిక్కుల్లో పడ్డారు.

  • Loading...

More Telugu News