: శనివారంలోగా బెర్తులు ఖరారు చేయండి: బీజేపీకి శివసేన డెడ్ లైన్


మహారాష్ట్రలో శివసేన తన సహజసిద్ధ పంథాను వీడేలా కనిపించడం లేదు. మొండిపట్టుదలతో 25 ఏళ్ల నాటి బీజేపీ దోస్తీకి స్వస్తి చెప్పిన ఆ పార్టీకి మరిన్ని సీట్లు లభించినా, భంగపాటు తప్పలేదు. ఫలితాల అనంతరం బీజేపీతో కాళ్ల బేరానికి వచ్చిన శివసేన, ప్రభుత్వంలో చేరతామని, మునుపటి దోస్తీకి మళ్లీ తలుపులు తెరవాలని కోరింది. దీనికి బీజేపీ కూడా సరేననడంతో పార్టీకి మునుపటి ప్రాభవం వచ్చినట్టేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భావించారు. అంతే, తిరిగి తన పాత మంకుపట్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. తాము అడిగిన మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ లో బెర్తుల ఖరారును శనివారంలోగా ముగించాలని కోరారు. దీనికి బీజేపీ కూడా సరేనన్నా, శివసేన అడిగినన్ని బెర్తులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేదు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదు కేబినెట్ హోదాలతో కలిపి పది మంత్రి పదవులు ఇవ్వాలని ఉద్ధవ్ ప్రతిపాదించారు. అయితే డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేస్తున్నట్లు ఫడ్నవీస్ సర్కారు తేల్చిచెప్పింది. అయితే ఆరు కేబినెట్ హోదాలతో కూడిన 12 బెర్తులను కేటాయించండి అంటూ కొత్త ప్రతిపాదన బీజేపీ ముందుకొచ్చింది. ఉద్ధవ్ బీరాలను అంత సీరియస్ గా పరిగణించని బీజేపీ నాలుగు కేబినెట్ హోదాలతో కూడిన ఎనిమిది మంత్రి పదవులను శివసేనకు కేటాయించేందుకు సిద్ధమైంది. అసలే ముగిసిందనుకున్న స్నేహం చిగురించిన నేపథ్యంలో ఎన్ని బెర్తులు తగ్గినా, ఉధ్దవ్ మాత్రం అంగీకరించక తప్పేలా లేదు.

  • Loading...

More Telugu News