: కోల్ కతా నౌకాశ్రయానికి ‘ఉగ్ర’ ముప్పు!
వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఉగ్రవాద దాడి తరహాలో దాడుల ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో కోల్ కతా నౌకాశ్రయంలో భద్రత పెరిగింది. కోల్ కతా నౌకాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడనున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతను పెంచినట్లు కోల్ కతా పోలీస్ కమిషనర్ సురోజిత్ కర్పురకాయస్థ చెప్పారు. పోలీసు బలగాలతో పాటు కోస్ట్ గార్డ్ కూడా తీరం వెంట నిఘాను పెంచినట్లు ఆయన చెప్పారు. నౌకాదళ వారోత్సవాల సందర్భంగా ప్రజల సందర్శనార్థం తీరానికి చేరిన ఐఎన్ఎస్ ఖుర్కి, ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలు మంగళవారం రాత్రి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాయి. ఉగ్రవాద కదలికలపై నిఘా పెంచేందుకు సదరు నౌకలను సముద్ర జలాల్లోకి పంపినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర నిఘా వర్గాల హచ్చరికల నేపథ్యంలో కోల్ కతాలోనే కాక హాల్దియా, విశాఖ పోర్టుల్లోనూ భద్రత పెరిగింది.