: కుల ధ్రువీకరణకెళితే... కోరిక తీర్చమన్నాడు: ప.గో.జిల్లాలో వీఆర్వో కీచక పర్వం
పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం వీఆర్వో కీచక పర్వం వెలుగు చూసింది. కుల, ఆదాయ ధ్రవీకరణ పత్రాల కోసం వెళ్లిన కళాశాల విద్యార్థినిలను కోరిక తీర్చమంటూ వేధింపులకు గురి చేసిన వీఆర్వోను ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని చాకచక్యంగా పోలీసులకు పట్టించింది. వీఆర్వో వేధింపుల పర్వాన్ని రహస్య కెమెరాతో చిత్రీకరించిన సదరు విద్యార్థిని వీఆర్వోను ఆధారాలతో బుక్ చేసేసింది. జిల్లాలోని అగడాలలంక వీఆర్వో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తన వద్దకు వచ్చే కళాశాల విద్యార్థినిలను కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. వీఆర్వో వేధింపులతో విసిగిపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అతడికి బుద్ధి చెప్పేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. వీఆర్వోకు తెలియకుండా రహస్య కెమెరాను ఏర్పాటు చేసిన సదరు విద్యార్థిని, వీఆర్వో లీలను రికార్డు చేసింది. అనంతరం విషయాన్ని గ్రామస్తులకు తెలిపింది. దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన గ్రామస్తులు బుధవారం కీచక వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.