: ఈ ఏటీఎం డబ్బులివ్వదు... మహిళల బాధలు వింటుంది!
మనిషి మేధస్సు ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతోంది. ఇది కూడా అలాంటిదే. భారత సంప్రదాయంలో జీర్ణించుకుపోయిన పరువు ప్రతిష్ఠల అంశం తీవ్రతను గమనించిన జైదీప్ నాయక్ ఆలోచన ఓ కొత్త రకం ఏటీఎంకు రూపకల్పన చేసింది. 'ఐ క్లిక్' పేరిట ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ ప్రత్యేకమైనది. బ్యాంకు ఏటీఎం పక్కనే అలాంటిదే మరో మిషన్ (ఐ క్లిక్) ఉంటుంది. అయితే దాని నుంచి డబ్బు రాదు. అది సమస్యలను వింటుంది. ఆ యంత్రానికి మైక్రోఫోన్ అమర్చారు. అది మహిళలు చెప్పుకునే వ్యధలను వింటుంది. రికార్డు చేస్తుంది. వెంటనే పోలీసులకు విషయం చేరవేస్తుంది. తరువాత పోలీసులు వారి పని వారు చేసుకుంటారు. కుటుంబ హింస, లైంగిక వేధింపులు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడే మహిళల కోసం పోలీసులు ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో ఏర్పాటు చేసిన ఈ యంత్రం ముందు రోజూ కనీసం ఐదుగురు మహిళలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. సాధారణంగా మన సమాజంలో మహిళలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే వెనుకంజ వేస్తారు. పోలీసులే వేధింపులు ప్రారంభిస్తే అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. వీటన్నింటికీ పరిష్కారంగా ఈ మిషన్ ను రూపకల్పన చేసినట్టు అదికారులు చెబుతున్నారు. మొత్తానికి పోలీసుల ఆలోచన బాగుందని అందరూ కితాబులిస్తున్నారు. కాగా, ఐక్లిక్ రూపకర్త జైదీప్ ఒడిశా పోలీసు శాఖలో మానవ హక్కుల విభాగంలో పనిచేస్తున్నారు.