: ముచ్చటగా మూడో 'హ్యాట్రిక్' సాధించిన మిశ్రా
పుణేలోని సహారా స్టేడియంలో నేటి సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి పుణే వారియర్స్ కొంపముంచాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి ముందుంచింది స్వల్ప లక్ష్యమే అయినా సన్ రైజర్స్ అమోఘ పోరాట పటిమ ప్రదర్శించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 119 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో సాఫీగా సాగిపోతున్న వారియర్స్ ను లెగ్ స్పిన్సర్ అమిత్ మిశ్రా హ్యాట్రిక్ తో దెబ్బతీశాడు. స్కోరు 106/6 వద్ద పుణే జట్టు 2 ఓవర్లలో 14 పరుగులు చేయాల్సిన స్థితిలో బంతి పట్టిన మిశ్రా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు. ఓవర్ రెండో బంతికి కెప్టెన్ మాథ్యూస్ (20)ను అవుట్ చేసిన మిశ్రా నాలుగోబంతికి భువనేశ్వర్ (0) ను, ఐదో బంతికి రాహుల్ శర్మ (0)ను, ఆరో బంతికి దిండా (0)ను పెవిలియన్ చేర్చి హైదరాబాద్ జట్టుకు అద్భుత విజయం అందించాడు. కాగా, మిశ్రాకు ఐపీఎల్ లో ఇది మూడో హ్యాట్రిక్ కావడం విశేషం. ఇంతకుముందు 2008, 2011 సీజన్లలోనూ మిశ్రా ఈ ఘనత సాధించాడు.