: రాజకీయాలు ఆపండి...కూర్చుని మాట్లాడుకోండి!: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సూచన
తెలుగు రాష్ట్రాలు రెండూ రాజకీయాలు ఆపి, పరస్పరం సహకరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు బృందంతో ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు, ఏపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత, ఆ పార్టీ నేతలు తమ పట్ల విష ప్రచారం చేస్తున్నారని గోయల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అసహనానికి గురైన గోయల్, "ముందుగా రాజకీయాలు బంద్ చేయండి. ఇదేదో ఒక్క రాష్ట్రానికి చెబుతున్న మాట కాదు. రెండు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను సూచిస్తున్న మాట ఇది. సీఎంలకూ ఇదే మాట చెప్పాను. ఇప్పుడు మీకూ ఇదే చెబుతున్నా. ఇద్దరు సీఎంలు కలసి చర్చించుకుంటే సమస్య అన్నది అక్కడే పరిష్కారమవుతుంది కదా?" అని గోయల్ వ్యాఖ్యానించారు. సీఎంలిద్దరూ చర్చలకు కూర్చుంటే, అవసరమైతే తానూ ఆ చర్చల్లో పాల్గొంటానని కూడా గోయల్ వ్యాఖ్యానించారు.