: ఫేస్ బుక్ లో 'ఏకే47'తో దర్శనమిచ్చిన కాశ్మీర్ నేత పుత్రరత్నం!
జమ్మూకాశ్మీర్ లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత నసీర్ అస్లామ్ కుమారుడు ఫేస్ బుక్ లో ఏకంగా ఏకే47తో దర్శనమిచ్చాడు. దీనిపై వివాదం రేగుతోంది. పోలీసు అధికారులతో పాటు తాను కూడా ఏకే 47 రైఫిల్ పట్టుకుని దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో అస్లామ్ కుమారుడు పోస్టు చేశాడు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏకే47 పట్టుకునేందుకు అవకాశమిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా, దీనిపై ఎన్సీ నేత నసీర్ అస్లామ్ మాట్లాడుతూ, తన కుమారుడు పోలీసు అధికారి కావాలనుకుంటున్నాడని, అది తప్పా? అని ప్రశ్నించారు. అయితే ఆ ఫోటో గురించి తనకు తెలియదని పేర్కొన్న అస్లామ్, తన కుమారుడి ఫేస్ బుక్ పేజీ పరిశీలిస్తానని మాత్రం చెప్పారు.