: తెలంగాణ సర్కారుపై డీటెయిల్డ్ గా విరుచుకుపడ్డ దేవినేని ఉమా


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైన కృష్ణాజలాల అంశంపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరణాత్మకంగా స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నదీ జలాల బోర్డుల విభజన అంశం చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కోరుకున్నట్టే కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటైందని తెలిపారు. మిత్రుడు జగన్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడని, అందుకే, అతని తరపున కేసీఆర్ మాట్లాడుతున్నట్టుందని ఎద్దేవా చేశారు. ఈ అంశంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కావాలని సమస్యను కొనితెచ్చుకుంది తెలంగాణ సర్కారే అని దెప్పిపొడిచారు. ఏపీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కేసీఆర్ విజయవాడలో సభ పెడతాననడంపై మాట్లాడుతూ, విజయవాడలో కాదని, సొంత జిల్లా విజయనగరంలో పెట్టుకోవాలని ఉమా సవాల్ విసిరారు. కరవు ప్రాంతాల్లోని రైతులు బాగుండాలనే తాము కోరుకుంటున్నామని, అందుకే విద్యుదుత్పత్తి అంశంలో పంతాలకు పోవడంలేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో రాగి సంకటి ముద్ద పెడతాం, ఓ గ్లాసు నీళ్లివ్వండని అడుగుతుంటే, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో నీటి సమస్యపై తామేమీ మాట్లాడడంలేదని, హరీశ్ రావు మంచినీటిపై మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ సర్కారు నెట్టెంపాడు నుంచి 2.63 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.62 టీఎంసీలు, భీమా నుంచి 2 టీఎంసీలు, కోయిల్ సాగర్ నుంచి 1.8 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 7.05 టీఎంసీలు, ఏఎంఆర్ ప్రాజెక్టు కెనాల్ కింద 13.15 టీఎంసీలు, హైదరాబాద్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు 4.72 టీఎంసీలు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి 60.96 టీఎంసీల నీటిని వాడుకుందని ఉమా వివరించారు. ఇక, జీవో నెంబర్ 107లో చెప్పకపోయినా శ్రీశైలం నుంచి 243 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తికి వాడుకుందని ఆరోపించారు. తద్వారా 1307 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారని వివరించారు. అటు, నాగార్జునసాగర్ లో 133 టీఎంసీల నీటితో 872 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారని తెలిపారు. మొత్తమ్మీద 2179 మిలియన్ యూనిట్ల మేర విద్యుదుత్పత్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం తమపైనే ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News