: బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారి సస్పెన్షన్
నెల్లూరు జిల్లాలో బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ జారీ చేసి, ఆ సర్టిఫికెట్ ను అతనికే ఇచ్చిన హెల్త్ ఆఫీసర్ వెంకటరమణను సస్పెండ్ చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ చక్రధర్ బాబు ప్రకటించారు. దళిత కులానికి చెందిన రాఘవేంద్ర కుల, నివాస ధృవపత్రాలు తీసుకునేందుకు మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లగా 'అప్పుడు, ఇప్పుడు' అంటూ రెండున్నర నెలలపాటు అతనిని ఆఫీసు చుట్టూ తిప్పారు. దీంతో, ఆఫీస్ లో విచారించగా 10 వేలు ఇస్తే పని పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, అతను 10 వేలు చెల్లించి తనకు కావాల్సిన సర్టిఫికేట్ తీసుకున్నాడు. అయితే, అధికారుల అవినీతిని బయటి ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో డెత్ సర్టిఫికేట్ కు అప్లై చేశాడు. దీంతో, అధికారులు, బ్రోకర్లు కలిసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. తాను దళితుడినని, అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 50 వేల రూపాయలు తీసుకుని, 'నువ్వు చచ్చిపోయావు పో' అంటూ అతని డెత్ సర్టిఫికేట్ అతనికే అందజేశారు. ఇది మీడియాలో ప్రసారం కావడంతో నెల్లూరు జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. దీనిపై, విచారణ జరిపి హెల్త్ ఆఫీసర్ వెంకటరమణను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.