: నా ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అవాస్తవ కథనాలు ప్రచురించారు: శ్వేతాబసు


రెండు నెలలు రెస్క్యూ హోంలో గడిపిన అనంతరం విడుదలయిన నటి శ్వేతాబసు ప్రసాద్ నాలుగు రోజుల కిందట ముంబయిలోని తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో తొలిసారి ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా వ్యభిచారం కేసులో తను అరెస్టవడం, హోంలో గడిపిన సమయం, తనపై మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించింది. గత శుక్రవారం తాను ఇంటికి వచ్చానని తెలిపింది. క్లిష్ట పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు అవాస్తవ కథనాలు రాసి, తనపై నిందలు ఆపాదించిన జర్నలిస్టుపై తప్ప తనకు ఎవరిపైన, ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పింది. వారు రాసిన కథనం ప్రతిచోట ప్రచారమయిందని, తాను రెస్క్యూ హోంలో ఉన్నప్పుడు పత్రికలు, వెబ్ సైట్లు అందుబాటులో లేవని, అందుకే తనకేమీ తెలియలేదని శ్వేతబసు వివరించింది. బయటికి వచ్చాకే విషయాలన్నీ తెలిశాయని చెప్పింది. తను కస్టడీలో ఉండగా ఎలాంటి ప్రకటన చేయలేదన్న శ్వేత... అసలు తన తల్లిదండ్రులతో మాట్లాడటానికే పోలీసులు ఒప్పుకోలేదని పేర్కొంది. అలాంటప్పుడు మీడియాతో ఎలా మాట్లాడగలను? అని ప్రశ్నించింది. ఏదిఏమైనా తనపై తప్పుడు కథనం రాసి, తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన జర్నలిస్ట్, పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వారి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇదే సమయంలో తాను అరెస్టవడానికి కారణాలను శ్వేత వెల్లడించింది. ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చానని, తిరిగి వెళ్లాలనుకుంటుండగా ఫ్లైట్ మిస్ అవడంతో హోటల్ రూమ్ లో అలాగే ఉండిపోయానని తెలిపింది. దురదృష్టమో ఏమో కానీ ఆ సమయంలో పోలీసులు దాడిచేసి తనను అరెస్టు చేశారని చెప్పింది. దాంతో, తాను బాధితురాలిగా మారానని, అసలు విషయాలు బయటకు రాకుండా చేశారని శ్వేతాబసు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల విచారణ సమయంలో, వ్యభిచారానికి పాల్పడిన టాలీవుడ్ తారల పేర్లు చెప్పాలని అడిగారని, కానీ తానెందుకు ఇతరులపై కామెంట్ చేయాలన్నానని తెలిపింది. రెస్క్యూ హోంలో ఉన్నప్పుడు అక్కడి పిల్లలకు టీచర్ గా హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు, హిందుస్థానీ క్లాసికల్ సంగీతం నేర్పించానంది.

  • Loading...

More Telugu News