: బొగ్గు గనులపై సుప్రీం తీర్పుతో... అదానీకి రూ.6 వేల కోట్ల నష్టం!
యూపీఏ హయాంలో కేటాయించిన బొగ్గు గనులను రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితుడు గౌతం అదానీ నేతృత్వంలోని ఆదానీ గ్రూపుకు భారీ లాభమేనని అందరూ అనుకున్నారు. అయితే, ఆ తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూపు ఏకంగా రూ.6 వేల కోట్లను నష్టపోవాల్సి వచ్చింది. బొగ్గు దిగుమతిలో దేశంలోనే పేరెన్నికగన్న అదానీ గ్రూపు, దేశీయ బొగ్గు గనుల రద్దుతో కీలకంగా మారతారన్న భావన వ్యక్తమైంది. దీంతో ఆ గ్రూపుకు భారీ లాభాలు వచ్చిపడటం ఖాయమన్న వాదన కూడా వినిపించింది. అయితే, గనుల అభివృద్ధి, నిర్వహణ (ఎండీఓ) రంగంలో 2007లోనే కాలుమోపిన అదానీ గ్రూపు, దేశంలోని నాలుగు దిగ్గజ బొగ్గు గనుల కాంట్రాక్టులను దక్కించుకుంది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సదరు కంపెనీల లైసెన్సులు రద్దయ్యాయి. దీంతో అదానీ గ్రూపుకు ఈమేర భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఒడిశాలో రూ. 12 వేల కోట్లతో ఈ సంస్థ గ్రూపు నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశ్నార్థకంగా మారింది.