: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఇక లేనట్టే!
తమిళనాడులో కాంగ్రెస్ నావ పూర్తిగా మునిగినట్టే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన కేంద్ర మాజీ మంత్రి జి.కె.వాసన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాసన్ బాట పట్టారు. మరో ఇద్దరు కూడా వాసన్ వైపే రానున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో, ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో నామరూపాల్లేకుండా కనుమరుగయ్యే దారుణ పరిస్థితి తలెత్తింది. కాగా, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వాసన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. తిరుచ్చిలో జరిగే కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి వాసన్ హ్యాండ్ ఇవ్వడానికి కారణం మాజీ ఆర్థిక మంత్రి చిదంబరమేనట. ఆయనతో విభేదాల కారణంతోనే వాసన్ పార్టీని వీడారని వినికిడి.