: సచిన్ కెరీర్లో చేదు అనుభవాలు
బ్యాటింగ్ పరంగా సచిన్ టెండూల్కర్ ను వేలెత్తి చూపలేం. కానీ, కెప్టెన్ గా సచిన్ కు ఎన్నో చేదు అనుభవాలున్నాయి. జట్టును విజయాల బాటలో నడపలేకపోవడం, దారుణమనదగ్గ పరాభవాలు అతడి హయాంలోనే చోటు చేసుకోవడం తెలిసిందే. తన కెరీర్లో ఎదురైన క్లిష్ట సమయాలను గురించి ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో వివరించాడు సచిన్. అందులో, 1997లో విండీస్ తో బ్రిడ్జ్ టౌన్లో జరిగిన టెస్టును గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో కనీసం 120 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేయడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే కుప్పకూలామని, లక్ష్మణ్ ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడని సచిన్ పేర్కొన్నాడు. ఓపెనర్ గా బరిలో దిగిన లక్ష్మణ్ 19 పరుగులు చేయగా, అదే టాప్ స్కోర్! రెండో ఇన్నింగ్స్ కు ముందురోజు స్థానిక రెస్టారెంట్ కు వెళ్లిన సచిన్, అక్కడి వెయిటర్ తో తన సంభాషణను వివరించాడు. భారతే గెలుస్తుందని తానంటే, ఆంబ్రోస్ విండీస్ ను గెలిపిస్తాడని ఆ వెయిటర్ ధీమా వ్యక్తం చేశాడని తెలిపాడు. గెలిచిన వెంటనే ఈ రెస్టారెంటుకే వస్తామని, షాంపేన్ గ్లాస్ ఇస్తానని వెయిటర్ తో చెప్పినట్టు సచిన్ గుర్తు చేసుకున్నాడు. అయితే, అత్యంత దారుణ ప్రదర్శన కనబర్చడంతో ఓటమిపాలయ్యామని, తను చూసిన అత్యంత చెత్త ప్రదర్శనల్లో బ్రిడ్జ్ టౌన్ టెస్టు కూడా ఒకటని పేర్కొన్నాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో అర్ధాంగి అంజలి అండగా నిలిచిందని సచిన్ తన పుస్తకంలో తెలిపాడు. 2001లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో తనను మోసగాడిగా పేర్కొనడం బాధించిందన్నాడు. తాను బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డట్టు రిఫరీ మైక్ డెన్నిస్ నిర్ధారించడం ఎంతగానో కలచివేసిందన్నాడు.