: తన కుమార్తెలా మరెవరూ కాకూడదని... ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తిన ఘజియాబాద్ మహిళ
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో డోరిస్ ఫ్రాన్సిస్ (57) అనే మహిళ ట్రాఫిక్ విభాగంలో ఉద్యోగిని కాదు. అయినా, ఆమె ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూ కనిపిస్తారు. 24వ నెంబర్ జాతీయ రహదారిపై ఐత్బార్ పుష్తా వద్ద ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ను నియంత్రిస్తుంటారు. అందుకు బలమైన కారణమే ఉంది. 2008 నవంబర్ 9న డోరిస్, ఆమె భర్త విక్టర్, కుమార్తె నికీ (17) ఓ ఆటోలో వస్తుండగా, వేగంగా వచ్చిన కారు వారు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. గాయపడ్డ ముగ్గురూ ఆసుపత్రి పాలయ్యారు. ఊపిరితిత్తులకు బలమైన దెబ్బ తాకడంతో నికీ ఏడాదిపాటు ఆసుపత్రికే పరిమితమైంది. చివరికు చికిత్స పొందుతూ మరణించింది. అప్పటి నుంచి డోరిస్ ఇలా ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తారు. ఆమె ట్రాఫిక్ నియంత్రించడం మొదలుపెట్టాక ఆ ప్రదేశంలో ఒక్క రోడ్డు ప్రమాదం మాత్రమే సంభవించింది. అది కూడా డోరిస్ ఆదివారం నాడు చర్చికి వెళ్లడంతో అక్కడ విధులు నిర్వర్తించేవారు లేకపోయారు. ఆ సమయంలోనే ప్రమాదం జరగడంతో ఓ మహిళ మృతి చెందింది.