: మీడియాపై చిందులేసిన అల్లుడిని కలిసిన సోనియా!
మీడియాపై దురుసుగా ప్రవర్తించి దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొన్న తన అల్లుడు రాబర్ట్ వాద్రాను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలిశారు. ఆదివారం లోధి ఎస్టేట్ లోని కుమార్తె ప్రియాంక ఇంటికి వెళ్లిన సోనియాగాంధీ, అక్కడ దాదాపు అరగంటకు పైగా గడిపారు. అప్పటిదాకా వాద్రాను వెనకేసుకువచ్చేందుకు సాహసించని కాంగ్రెస్ నేతలు, వాద్రా ఇంట సోనియా అడుగు పెట్టగానే రంగంలోకి దిగారు. మీడియానే వాద్రాను రెచ్చగొట్టేలా వ్యవహరించిందని ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. సదరు కేసులో వాద్రా ప్రమేయం ఏమీ లేదని కోర్టు తేల్చిచెప్పినా, అదే విషయంపై పదే పదే ప్రశ్నలు సంధించిన మీడియా వాద్రా సహనాన్ని పరీక్షించేలా వ్యవహరించిందని ఆరోపించారు. "ఓ ప్రైవేట్ వ్యక్తిని మీడియా ఎలా చుట్టుముడుతుంది? ఒకవేళ అతడు చట్టాన్ని ధిక్కరించి ఉంటే, విచారించడానికి కోర్టులున్నాయి. ఆధారాలను కోర్టులో సమర్పించండి. అయితే వాటిని వదిలేసి మీడియా ఇలా వ్యవహరించడం న్యాయ సమ్మతం కాదు" అని పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.