: హుస్సేన్ సాగర్ తొలి గ్లాసు నీటిని కేసీఆరే తాగాలి: నారా లోకేష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ యువనేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబును తిట్టడం తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఏపీ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అనగానే... తాము కూడా చేపడతామని కేసీఆర్ అంటున్నారని... అయితే, వాటర్ గ్రిడ్ కోసం 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందన్న సంగతి కేసీఆర్ కు తెలియదని లోకేష్ ఎద్దేవా చేశారు. మరోవైపు, కేసీఆర్ రాష్ట్రాన్ని విడగొట్టడంతో, తమ భూముల రేట్లు భారీగా పెరిగాయని ఏపీ రైతులు ఆనందంలో ఉన్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో, తమ రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నారని చెప్పారు. ఇప్పటికే నిధులన్నీ ఏపీకి వస్తున్నాయని... భవిష్యత్తులో ఏపీ వెలిగిపోతుందని అన్నారు. హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ అంటున్నారని... ప్రక్షాళన చేసిన తర్వాత తొలి గ్లాసు నీటిని ఆయనే తాగాలని లోకేష్ అన్నారు. దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని అన్న కేసీఆర్... ఇప్పుడేమి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ ప్రారంభించిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని విమర్శించారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనడం తప్ప ఆయన చేసిందేమీ లేదని తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేవనెత్తిన ప్రజా సమస్యలనే మావోయిస్టులు కూడా లేవనెత్తుతున్నారని అన్నారు.