: శ్రీశైలం ఎడమ గట్టులో విద్యుదుత్పత్తి నిలిపివేత
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ఎడమ గట్టు పవర్ హౌస్ లో విద్యుదుత్పత్తి సోమవారం ఉదయం నిలిచిపోయింది. నీటి మట్టం కుచించుకుపోతున్న నేపథ్యంలో తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నీటి యాజమాన్య బోర్డు తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే బోర్డు తన తీర్పును పున:సమీక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్కారు ఆదివారం రాత్రి దాకా విద్యుదుత్పత్తిని కొనసాగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బోర్డు తీర్పును వ్యతిరేకిస్తూనే తెలంగాణ సర్కారు, సోమవారం విద్యుదుత్పత్తిని నిలిపివేయక తప్పలేదు. అయితే ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. నేడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ కానున్న ఆయన బోర్డు నిర్ణయంపై ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాక రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతల నేపథ్యంలో విద్యుదుత్పత్తికి అనుమతించాలని ఆయన కేంద్రాన్ని కోరే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి స్పందన వచ్చేదాకా తెలంగాణ సర్కారు ఎడమ గట్టులో విద్యుదుత్పత్తిని ప్రారంభించకపోవచ్చు.