: రేపటి నుంచి ఏపీలో జూడాల సమ్మె
వైద్య విద్యార్థులకు గ్రామీణ సేవల అంశం... ఆంధ్రప్రదేశ్ లోనూ జూడాలను సమ్మె బాట పట్టేలా చేస్తోంది. తెలంగాణలో ఇదే అంశంపై నెలకు పైగా జూడాలు సమ్మె చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా జూడాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోనూ జూడాలు సోమవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. రూరల్ సర్వీస్ ను రెగ్యులర్ సర్వీసుగానే పరిగణించాలని జూడాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కాని పక్షంలో రూరల్ సర్వీసును పూర్తిగా రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఇదే విషయంపై మూడు రోజుల కిందట జూడాలు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. శనివారం తిరుపతిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో జూడాలు భేటీ అయ్యారు. అయితే రూరల్ సర్వీసు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేమంటూ మంత్రి చేతులెత్తేయడంతో సమ్మెకు దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాల సమ్మె నోటీసుతో ప్రభుత్వం స్పందించి, సమ్మెను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటుందా అన్న విషయంపై ప్రస్తుతం చర్చకొనసాగుతోంది.