: తెలంగాణ సర్కారుకు ఎవరు చెప్పినా తలకెక్కడంలేదు: చంద్రబాబు


పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సర్కారుకు ఎవరు చెప్పినా తలకెక్కడం లేదని, ఎవరి మాటా వినడం లేదని విమర్శించారు. శ్రీశైలం జలవివాదంలో తెలంగాణ వైఖరి సరికాదని అన్నారు. శ్రీశైలం జలాలను పద్ధతి ప్రకారం వాడుకోవాలని సూచించారు. తొలుత సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే విద్యుదుత్పత్తి చేయాలని హితవు పలికారు. విద్వేషాలకు పోతే ప్రజలకు న్యాయం జరగదని హితవు పలికారు. ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎవరికీ విద్వేషాలు లేవని, నేతలే విద్వేషాలు లేవనెత్తుతున్నారని పరోక్షంగా టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. తెలుగువారంతా కలసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని చీల్చిందని, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని అన్నారు. స్వార్థంతో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం నేర్పారని, భూస్థాపితం చేశారని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు ఆశ్చర్యపోయే విధంగా కసిగా పనిచేసి అభివృద్ధి పథంలో నడుద్దామని తెలిపారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఏపీకి అనుకూలమని, వారి సాయంతో ముందుకువెళదామని అన్నారు. విభజన అనంతరం ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. కొన్ని సమస్యలపై రెండు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగకుండా, చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకుని 300 మెగావాట్లు ఇస్తామన్నా, తెలంగాణ సర్కారు ముందుకురాలేదని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News