: నా వాటా నాకివ్వకపోతే కోర్టు కెళ్తా: సినీ నటుడు కార్తీక్
ఆస్తిలో తన వాటా తనకివ్వకపోతే కోర్టుకెళ్లేందుకు కూడా వెనుకాడనని తమిళ హీరో కార్తీక్ తెలిపాడు. చెన్నైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి రాసిన విల్లును దాచేసి, తన అన్న నకిలీవి సృష్టించాడని, అదేంటని అడిగితే అది అమ్మ రాసిన విల్లు అంటున్నాడని వాపోయారు. అయితే ఆ విల్లు ఆంగ్ల భాషలో ఉందని, తన తల్లికి ఆంగ్లము తెలియదని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత నటుడు ముత్తురామన్ స్థిరాస్తుల్లో వాటా దక్కించుకునేందుకు న్యాయపోరాటానికి కూడా వెనుకాడనని అన్నారు. తాను చెన్నయ్ లోని పొయెస్ గార్డెన్ లోని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయానని ప్రచారం జరుగుతున్నదని, కానీ ప్రస్తుతం తాను ఆ ఇంట్లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఆస్తి వివాదం పరిష్కరించుకునేందుకు తన అన్న ముందుకు రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కార్తీక్ తెలిపారు. ఆస్తి వివాదం నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. కాగా, 'సీతాకోక చిలుక', 'అభినందన' సినిమాలతో కార్తీక్ తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు.