: భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు
నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా హత్యాయత్నం, దాడి కేసులు నమోదయ్యాయి. దీంతో, నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ భయంతో భూమా నాగిరెడ్డి తన గన్ మెన్లను సైతం వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. భూమా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు భూమా ప్రధాన అనుచరుడు సుబ్బారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య గొడవ జరిగింది. నంద్యాలలో ఆక్రమణల తొలగింపు అంశంపై రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో, మున్సిపల్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ పై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో టీడీపీ కౌన్సిలర్లుకు, సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. భూమా సమక్షంలోనే ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, తమ కౌన్సిలర్లపై దాడిని ఖండిస్తూ టీడీపీ ఈ రోజు నంద్యాల బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ శ్రేణుల పిలుపుతో నంద్యాలలో బంద్ కొనసాగుతోంది. దీంతో, పట్టణంలోని దుకాణాలన్నీ మూతపడటంతో పాటు, ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.