: పటేల్ తలుచుకోకుంటే హైదరాబాద్ ఓ దేశమై ఉండేది: చంద్రబాబు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడి ఉద్యోగులతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రసంగిస్తూ, పటేల్ తలుచుకోకుంటే హైదరాబాద్ ఓ దేశమై ఉండేదని, తద్వారా, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదని అన్నారు. మొండిగా వ్యవహరించిన హైదరాబాద్ వంటి సంస్థానాలు సైతం విలీనమయ్యాయంటే అందుకు హోం మంత్రిగా పటేల్ వ్యవహరించిన కఠిన వైఖరే కారణమని బాబు తెలిపారు. హోం మంత్రిగా ఆయన దేశం గర్వపడేలా చేశారని కీర్తించారు. పటేల్ ను తలుచుకుంటేనే దేశభక్తి ఉప్పొంగుతుందని అన్నారు. ఆ మహోన్నతుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా బాబు పిలుపునిచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే అందుకు కారణం పటేల్ అని స్పష్టం చేశారు. పటేల్ అంటే దేశ సమైక్యతకు మారుపేరు అని, దేశం అంతా ఒక్కటిగా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.