: జగన్ కు మరో ఝలక్? వైసీపీని వీడాలనుకుంటున్న జమ్మలమడుగు సోదరులు!
వైసీపీకి 'జమ్మలమడుగు సోదరులు' రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవనారాయణరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కడప జిల్లాలో జోరుగా జరుగుతోంది. అధికారం దక్కక నిరుత్సాహంతో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పర్యవేక్షక కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన కడప జిల్లా సర్వసభ్య సమావేశానికి వీరిద్దరూ హాజరు కాకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. వీరికి అనుచరుడైన జడ్పీ చైర్మన్ గూడూరు రవి కూడా ఈ సమావేశానికి రాకపోవడం ఈ వార్తలకు మరింత బలమిచ్చింది. వైసీపీని వీడి టీడీపీలో చేరాలని ముందు అనుకున్నప్పటికీ, కడపలో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గం బలంగా ఉండటంతో, ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనను జమ్మలమడుగు సోదరులు విరమించుకున్నారని తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా, బీజేపీ వైపు ప్రస్తుతం ఆదినారాయణరెడ్డి సోదరులు చూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, జగన్ చిన్నాన్న మల్లికార్జునరెడ్డి కడపలో ఉండి కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో... కడప వైసీపీలో లుకలుకలు తీవ్రస్థాయికి చేరాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.