: ఫిట్ నెస్ ఘనంగా నిరూపించుకున్న రోహిత్ శర్మ


ఫామ్ లో ఉన్నా, గాయాలు ప్రతిబంధకంగా మారడంతో యువ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ కొంతకాలం పాటు జట్టుకు దూరం కాక తప్పలేదు. గాయాల నుంచి కోలుకున్న ఈ ముంబై క్రికెటర్ శ్రీలంక-ఇండియా 'A' జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో బ్యాట్ కు పనిచెప్పి సెంచరీతో సత్తా చాటాడు. అటు, తన ఫిట్ నెస్ పై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేశాడు. ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా A జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన రోహిత్ 111 బంతుల్లో 142 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. యువసంచలనం మనీశ్ పాండే (135*) కూడా సెంచరీ చేయడంతో ఇండియా A జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉన్ముక్త్ చాంద్ 54 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన లంకేయులు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 294 పరుగులే చేశారు. దీంతో, 88 పరుగులతో ఓటమిపాలయ్యారు. కాగా, తాజా ప్రదర్శనతో రోహిత్ టీమిండియా వ్యూహకర్తలకు పరీక్ష పెట్టినట్టయింది. ఎందుకంటే, ఓపెనింగ్ స్లాట్ లో రహానే, ధావన్ లు పాతుకుపోయారు. ఇప్పుడు రోహిత్ రాణించిందీ ఓపెనర్ గానే. దీంతో, రోహిత్ ను జట్టులోకి తీసుకుంటే ఎక్కడ ఆడించాలన్నది టీం మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారే అంశమే.

  • Loading...

More Telugu News