: సినీ నటి రజని కుమార్తెను కొట్టి, సస్పెండైన టీచర్
నిన్నటి తరం బహుభాషా నటి రజని కుమార్తెను చెంప దెబ్బ కొట్టిన టీచర్ సస్పెండయ్యారు. హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ శివార్లలోని కండ్లకోయలో ఉన్న డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రజని కుమార్తె రితిక ఏడవ తరగతి చదువుతోంది. తరగతిలో అల్లరి చేస్తోందన్న కారణంతో రితికను గణిత ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ చెంపదెబ్బ కొట్టారు. దీంతో, బాలిక తన తల్లికి ఫిర్యాదు చేసింది. దీనిపై రజని ఆగ్రహం వ్యక్తం చేసి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి లెక్కల మాస్టారిపై చర్య తీసుకోవాలని కోరింది. సెలబ్రిటీ కుమార్తె కావడం వల్లే తన బిడ్డపై చెయ్యిచేసుకున్నారని, గతంలో తన కుమారుడ్ని ఇలాగే కొట్టడంతో స్కూలు మార్పించానని ఆమె ఫిర్యాదులో తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మ్యాథ్స్ టీచర్ ను, ప్రిన్సిపాల్ ను పిలిచి విచారించారు. ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా గొడవ సద్దుమణగకపోవడంతో, గణిత ఉపాధ్యాయుడ్ని స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది.