: ఒక ఎయిర్ టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!
ఇటీవల కాలంలో విమానయాన సంస్థల మధ్య పోటీ తీవ్రమైంది. బంపర్ ఆఫర్లతో ప్రయాణికులకు గాలం వేసేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్, ఎయిరిండియా తదితర సంస్థలు టికెట్ల ధరల్లో భారీ డిస్కౌంట్ ప్రకటించి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఈ తరహాలో అంతర్జాతీయ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్ వేస్ కూడా వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది. ఒక బిజినెస్ క్లాస్ టికెట్ కొంటే మరో బిజినెస్ క్లాస్ టికెట్ ఉచితమంటూ ప్రకటించింది. ఖతార్ ఎయిర్ వేస్ భారత ఉపఖండం వైస్ ప్రెసిడెంట్ ఇనాబ్ సొరియల్ మాట్లాడుతూ, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఇదో అద్భుతమైన అవకాశమని తెలిపారు. ఈ ప్రత్యేక టికెట్లను అక్టోబర్ 31 వరకే విక్రయిస్తారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆఫర్ వర్తిస్తుంది. ఎంపిక చేసిన మార్గాల్లోనే ఈ ఆఫర్ అమలవుతుంది.