: మీ వాహనం పోయిందా... అయితే, వెదికిపెట్టే యాప్ ఇదిగో!
మీ వాహనం కనిపించడం లేదా? చోరులెవరైనా ఎత్తుకుపోయారా? అయితే, అదెక్కడుందో చెప్పేసే యాప్ అందుబాటులోకి వచ్చేసింది. చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు 'స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్' అనే యాప్ తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులందరికీ అందుబాటులోకి తెస్తున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఈ యాప్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వాహనచోరులను పట్టుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంజన్ నెంబరు, ఛాసిస్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు వీటిలో ఏ ఒక్క వివరం ఉన్నా దాని వాహన యజమాని వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, దాని ఆధారంగా వాహనం అసలు యజమాని ఎవరు అనే విషయం తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా వాహన దొంగతనాలు తగ్గుతాయని ఆయన తెలిపారు.