: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీ మారాలి: తీగలకు సరూర్ నగర్ బీజేపీ నేతల సూచన
టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలని సరూర్ నగర్ బీజేపీ నేతలు సూచించారు. ఈ మేరకు బీజేపీ కార్యకర్తలు బుధవారం తీగల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఎల్బీ నగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చావు డప్పులతో ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు తీగల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ తో కలసి తీగల టీఆర్ఎస్ లో చేరనున్న సంగతి తెలిసిందే. పార్టీ మారాలని నిశ్చయించుకున్న తీగలకు, టీడీపీ తరపున లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందని ఈ సందర్భంగా నిరసనకారులు మండిపడ్డారు. మెడికల్ కళాశాల ఏర్పాటు కోసమే తీగల పార్టీ మారుతున్నారని బీజేపీ నేతలు సురేశ్ కుమార్, ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గ ఓటర్లు టీడీపీని చూసే తీగలకు ఓట్లేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.