: పోలీస్ అకాడెమీలో మిస్ ఫైర్... తోటమాలికి గాయాలు


హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న మిస్ ఫైర్ ఘటనలో తోటమాలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవలే అకాడెమీలోని ఈత కొలనులో పడి ట్రైనీ ఐపీఎస్ అధికారి మృతి చెందిన ఘటనను మరువకముందే తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఐపీఎస్ ట్రైనీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో ఆయుధాలను ఓ చోటి నుంచి మరో చోటికి తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మైలార్ దేవ్ పల్లికి చెందిన తోటమాలి హబీబ్ నడుము భాగంలోకి తూటా దూసుకెళ్లింది. తోటమాలిని సిబ్బంది హుటాహుటీన యశోదా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో హబీబ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పాసింగ్ అవుట్ పరేడ్ కు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఘటన వెలుగులోకి రాకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా, మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రాత్రికల్లా బయటకు పొక్కింది.

  • Loading...

More Telugu News