: నా కొడుకుతో నటించాలని ఉందని దీపిక అనడమే బెస్ట్ కాంప్లిమెంట్: షారూఖ్
బాలీవుడ్ బాద్షా గత వారం రోజులుగా పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. షారూఖ్ లేటెస్ట్ హిట్ సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ద్వారా ఆయన చిన్న కుమారుడు అబ్ రామ్ వెండితెర అరంగేట్రం చేశాడు. దీంతో, బాలీవుడ్ ప్రముఖులంతా షారూఖ్ కుమారుడి ఎంట్రీని అభినందించారు. దీంతో, షారూఖ్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అన్నింట్లోకి దీపికా పదుకునే ప్రశంసే ఉత్తమమైనదని పేర్కొన్నాడు. అబ్ రామ్ చూడముచ్చటగా ఉన్నాడని, తరువాతి సినిమాలో అబ్ రామ్ తో నటించాలని ఉందని దీపికా చెప్పిందని షారూఖ్ సక్సెస్ మీట్ లో తెలిపాడు. తన పిల్లలతో కలసి ఆడుకోవడం తనకు చాలా ఇష్టమని చెప్పిన షారూఖ్, పెద్ద కుమారుడు ఆర్యన్ తో కలిసి ఫుట్ బాల్, వీడియో గేమ్స్ ఆడతానని చెప్పాడు. కాగా, షారూఖ్ తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' వారాంతానికి 108 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డుల దిశగా దూసుకుపోతోంది.